గుజరాత్‌లోని వడోదరలో వంతెన కూలిన దుర్ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో వంతెనలన్నీ కూలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో రోజు మరొక అద్భుతమైన ఉదాహరణ అంటూ సెటైర్లు వేశారు. ఒక క్షణం మీరు వంతెనపై ఉంటారు.. మరొక క్షణం నదిలో ఉంటారంటూ వ్యంగ్యంగా స్పందించారు. మోర్బి వంతెన కూలిపోయి 140 మందికి పైగా మరణించిన తర్వాత, ఇది మరొక షాకింగ్ విషయమని పేర్కొన్నారు. గుజరాత్, డబుల్ ఇంజిన్ బీహార్, మధ్యప్రదేశ్‌లలో కూలిపోతున్న ఈ వంతెనలన్నింటినీ ఎన్డీఎస్ఏ లేదా ఇతర వంతెన భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తాయని ఖచ్చితంగా భావిస్తున్నానన్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.