తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు సహా వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా పాలన సాగిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు ప్రజాదరణ మరింత పెరుగుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మత సామరస్యం, ప్రశాంత వాతావరణాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.
బీఆర్ఎస్ నాయకులు, పేదలపై వేధింపులు జరుగుతున్నాయంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి చర్యలను తమ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం ఏర్పడితే వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. డబుల్ ఇంజన్ పాలన పేరుతో ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మత రాజకీయాలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

