హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ సర్కార్ వేల కోట్ల స్కామ్‌కు తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్సీయూలో అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. కంచె గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న స్కామ్ పై విచారణ చేయాలని ఆర్బీఐ, సీబీఐ, సీవీసీ, ఎస్ఎఫ్ఐవో, సెబీకి ఆధారాలతో సహా లేఖ రాసినట్లు కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీతో కుమ్మక్కై భూములు అమ్మాలని చూసారని ఆరోపించారు. దీని కోసం రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడన్నారు. రేవంత్ రెడ్డి ఈ భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే టీజీఐఐసీకి బదిలీ చేశాడు కానీ మ్యుటేషన్ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి, లేని వాల్యూను ఉన్నట్లు చూపించి ఆర్బీఐని మిస్ లీడ్ చేసి స్కాం చేశాడని ఆరోపించారు. తనది కాని భూమిని తాకట్టు పెట్టి, రేవంత్ రెడ్డి రూ.10,000 కోట్లు తెచ్చుకొని ఆర్బీఐ గైడ్‌లైన్స్ తుంగలో తొక్కాడన్నారు. ఈ భూములపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈడీ ఎంక్వయిరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. త్వరలో రేవంత్‌కు సహకరించిన బీజేపీ ఎంపీ పేరు బయటపెడతానని చెప్పారు.