బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో లండన్‌లో మరణించిన అనంతరం, అతని కుటుంబంలో ఆస్తులపై పెద్ద వివాదం చెలరేగింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన సంజయ్, వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లతో తరచూ వార్తల్లో నిలిచేవాడు. రెండో భార్య కరిష్మా కపూర్‌కి పుట్టిన ఇద్దరు పిల్లలు, మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తీరు పట్ల న్యాయపోరాటానికి దిగారు. తమ తండ్రి ఆస్తిలో తగిన వాటా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, కరిష్మా పిల్లలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐదో వంతు వాటా తమకే రావాల్సిందని కోర్టులో పిటిషన్ వేశారు. సంజయ్ మరణించిన వెంటనే ప్రియా, ఆస్తుల బదిలీలు, ఖాతాల మార్పులు, ట్రస్ట్ పత్రాలన్నీ గోప్యంగా నిర్వహించిందని ఆరోపించారు. అంతేకాదు, చివరి వంతపత్రం (విల్) ఉందన్న సంగతి కూడా పలు సందేహాల తర్వాతే బయట పెట్టిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సంజయ్ ఆస్తులలో ఎక్కువ భాగం ఆర్‌కే ఫ్యామిలీ ట్రస్టులో ఉందని చెబుతున్నారు. కానీ ట్రస్ట్‌కు సంబంధించిన వివరాలను పిల్లలతో గానీ, కరిష్మాతో గానీ ఎప్పుడూ పంచుకోలేదని పిటిషన్ వాదిస్తుంది. జూలై 25న జరగాల్సిన ట్రస్ట్ సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం లేదన్న ఫోన్ కాల్‌పై కూడా పిల్లలు అభ్యంతరం తెలిపారు. విల్లు నిజమైనదా లేదా, ట్రస్ట్ ఆస్తులు ఏవీ, ప్రియా చర్యలు పిల్లల హక్కులకు భంగం కలిగించాయా అనే అంశాలపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసు తీర్పు సినీ ఇండస్ట్రీతో పాటు వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశం కానుంది.