హైదరాబాద్ నగరాన్ని అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం ఒక్కసారిగా ముంచెత్తింది. సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప్పల్ బేగంపేట పంజాగుట్ట బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ మరియు అమీర్ పేట ప్రాంతాల్లో నాలాలు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి మెదక్ మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన పలు జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

