ఎన్నికలకు ముందు శాంతిభద్రతలను కాపాడుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ, ఆంజనేయ ప్రసాద్ దంపతులు బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లారు. వారి 12 ఏండ్ల పాపను ఊర్లో ఉంటున్న చెల్లలు వద్ద ఉంచారు. ఈక్రమంలో చెల్లి మామ(వరుసకు తాత అయ్యే వ్యక్తి) గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు ఆ పాపను లైంగికంగా వేధించాడు. దీంతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో సమస్య అలాగే ఉంది. దీంతో చంద్రకళ భర్త ఆంజనేయప్రసాద్ శనివారం తెల్లవారుజామున కువైట్ నుంచి వచ్చి గుట్ట ఆంజనేయులును హత్య చేశాడు. తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపాడు. తన పాప పట్ల తాను చేసింది న్యాయమేనని, చట్టం ప్రకారం అన్యాయమన్నారు. పోలీసులకు తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.