బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యర్థులను బెదిరించేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను వాడిన బీజేపీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్నీ తన ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.తేజస్వీ యాదవ్ ప్రకారం, ఈసీ చాలామంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు అందిస్తోంది. గతేడాది విజయ్ కుమార్ సిన్హా వ్యవహారం, తాజాగా ముజఫర్‌పూర్ మేయర్ నిర్మలా దేవీ కేసు దీనికి ఉదాహరణలని తెలిపారు. నిర్మలా దేవీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచినా ఆశ్చర్యం లేదన్నారు.ఇంతటి వివాదం మధ్య ఈసీ మీడియా ముందుకు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, బీహార్ ముఖ్యమంత్రి కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఈసీ కూడా వారిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ప్రమాదంలో ఉందని తేజస్వీ హెచ్చరించారు.ఆగస్టు 17న రోహ్తాస్ జిల్లాలో ప్రారంభమయ్యే ‘ఓటర్ల హక్కు యాత్ర’లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నట్లు తెలిపారు. గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిఖూభాయ్ దల్సానియా బీహార్‌లో ఓటరుగా నమోదు కావడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.