పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం వైపు దూసుకెళ్తోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో వాతావరణం మరింత ఉధృతమవుతోంది. ఈనెల 19న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తుండగా, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతూ, బీచ్ రోడ్డులో ఎర్రటి వరదనీరు ఉధృతంగా పారుతోంది. సముద్రం కూడా అలజడి సృష్టిస్తూ రెడ్ కలర్‌లోకి మారిపోయింది. రాబోయే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున GVMC అప్రమత్తంగా సన్నద్ధత పనులు చేపట్టింది. ఇప్పటికే శ్రీకాకుళం, మన్యం, ఈస్ట్ గోదావరి, ఎలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుకు ఎల్లో బులెటిన్ జారీ చేశారు. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సమాచారం ప్రకారం, తీరం దాటే సమయంలో గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.