నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి మరోసారి బలహీనపడింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. కరైకాల్‌కు 120 కి.మీ., పుదుచ్చేరికి 90 కి.మీ., చెన్నైకి 150 కి.మీ. దూరంలో ఉంది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈ రోజు (సోమవారం) అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల బీచ్‌ను మూసివేసిన అధికారులు మత్స్యకారులను, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

