తెలంగాణలో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల హక్కులను హరించే కుట్రలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో గెలిచిన వారిలో చాలా మంది నాన్–బీసీలే ఉండటం అన్యాయమని అన్నారు. బీసీ సీట్లను మజ్లిస్ ఆధీనంలో పెట్టడం వల్ల వారికి లాభం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. బీసీ లెక్కల సర్వేను ప్రభుత్వం సక్రమంగా చేయలేదని, హైదరాబాద్‌లో 25 శాతం ఇళ్లను వదిలేసి సర్వే ముగించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దీని వెనుక ఉద్దేశ్యం బీసీ జనాభాను తక్కువగా చూపించి రిజర్వేషన్లు తగ్గించడమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మత ఆధారిత రిజర్వేషన్ల కోసం రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం ప్రయత్నించినట్లు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందని పేర్కొన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించింది బీజేపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలన్న రేవంత్ ప్రకటనపై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ తన ఆధీనంలోని రాష్ట్రాల్లో గెలవగలగాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిపై రాష్ట్ర మంత్రివర్యులు చేసిన వ్యాఖ్యలు అనుచితమని, సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అవినీతి బీఆర్‌ఎస్, చేతకాని కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.