తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ధర్మపురిలో జరిగిన పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ప్రతిపక్ష విమర్శలపై తనకు ఎలాంటి ఆందోళనలేదని, రాజకీయాల్లో విమర్శలు సహజమని వ్యాఖ్యానించారు. అయితే, గవర్నర్ రవి మాత్రం కేంద్రంలోని బీజేపీ కన్నా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. రాజ్‌భవన్‌లో కూర్చొని అధికార డీఎంకేపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి పంపిన బిల్లులను గవర్నర్ నిలిపివేస్తున్నారని, తమిళగీతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్య, శాంతిభద్రతలు, మహిళల రక్షణ వంటి అంశాలపై గవర్నర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని తెలిపారు. కేంద్ర గణాంకాల ప్రకారం తమిళనాడు దేశంలోనే అగ్ర రాష్ట్రమని స్టాలిన్ పేర్కొంటూ, గవర్నర్ ప్రజా వేదికలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.