తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహేశ్వరం జనరల్ పార్క్‌లో మలబార్ గ్రూపు స్థాపించిన జెమ్స్ అండ్ జ్యువెల్లరీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం, రంగాల వారిగా పరిశ్రమలు రాణించడానికి సహకరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి తెలంగాణలో గత ప్రభుత్వాల నుంచే సానుకూల విధానాలు అమలులో ఉన్నాయని, వాటిని మరింత మెరుగైన విధానంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. “తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఒక వ్యాపార నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. మహేశ్వరం ప్రాంతంలో నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి అందించబోతున్నాం. 30 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అధునాతన నగరాన్ని నిర్మించబోతున్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడే నైపుణ్యం ఇక్కడి యువతలో ఉంది. హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడగలదు. అందుకే ముంబయ్, బెంగుళూరు చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచ అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలని లక్ష్యంగా నిర్దేశించాం. రాబోవు వందేళ్ల వరకు రాష్ట్రానికి ఏమవసరమో భవిష్యత్ ప్రణాళికలతో రూపొందిస్తున్న తెంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే డిసెంబర్ 9న ఆవిష్కరిస్తాం. అధునాతన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై సింగపూర్, ఇతర దేశాల కన్సల్టెంట్లు నిరంతరం పని చేస్తున్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ దేశంలోనే లెజెండ్‌గా నిలిచింది. దేశంలో 35 శాతం బల్క్ డ్రగ్ హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి ప్రాంతం నుంచి మలబార్ బంగారం యూనిట్ ప్రారంభించడంతో ఇక బంగారంలోనూ తెలంగాణ ప్రసిద్ధి చెందుతుంది. బంగారం వ్యాపారం మంచి పేరున్న మలబార్ గోల్డ్ తన యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషకర పరిణామం. సరైన ప్రాంతంలో, సరైన రాష్ట్రంలో మలబార్ గోల్డ్ తన యూనిట్‌ను ప్రారంభించింది..” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.