ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ తమ అభినందనలు తెలియజేశారు. లోకేష్ తన సందేశంలో, “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎప్పుడూ ముందుంటారు. నన్ను సొంత తమ్ముడిలా ఆదరించిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, “అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనలతో పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు వర్థిల్లాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది. మరెన్నో విజయ శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తన సందేశంలో తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు.