జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్ ప్రధాన నాయకత్వం దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో నేతలతో భేటీ అయ్యి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జి. జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల వద్దకు ఏ విధమైన అజెండాతో వెళ్లాలో కేసీఆర్ సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని నేతలకు సూచించారు. ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌ను కలిశారు. అయితే కవిత రాజీనామా లేదా ప్రెస్‌మీట్‌కు సంబంధించిన విషయాలను కేసీఆర్ ప్రస్తావించలేదని సమాచారం. అదేరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎల్. రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్, బూత్‌ల వారీగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మైనారిటీ విభాగ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులు సూచించారు. త్వరలోనే కేటీఆర్ అధ్యక్షతన మరోసారి సమీక్షా సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.