ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా తీర జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరంతర వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత వాతావరణ పరిస్థితులను అధికారులు సమీక్షించి తరగతులు మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు మోంథా తుపాను క్రమంగా బలహీనపడుతోంది. రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

