ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ దసరా పండుగ తర్వాత విశాఖపట్నం నుంచి పరిపాలనను సాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. వైజాగ్ డెవలప్ మెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి విశాఖపట్నంకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం జగన్ సర్కారు కసరత్తులు చేస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15వ తేదీన విశాఖ మెట్రోకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.
తొలి విడతలో 76.90 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. 3 కారిడార్లు, 42 స్టేషన్లతో చేపట్టనున్న మొదటి విడత మెట్రో నిర్మాణం కోసం సుమారుగా రూ.10 వేల కోట్లు అవసరం అవుతుందని అంచనా. స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ దాకా ఉండే కారిడార్-1 పొడవు 34.40 కిలోమీటర్లు ఉంటుంది. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ దాకా 5.07 కిలోమీటర్ల పొడవైన రెండో కారిడార్ ఉంటుంది. తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు దాకా 6.75 కిలోమీటర్ల పొడవైన మూడో కారిడార్ ఉంటుంది. రెండో విడతలో నిర్మించే నాలుగో కారిడార్ కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకు 30.76 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తంగా అన్నీ కలిపి రెండు డిపోలు, 54 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
లైట్ మెట్రో రెండు దశల్ని కలిపితే రూ.14,309 కోట్లు అవసరం అవుతుందని అంచనా. దీని కోసం అవసరమయ్యే నిధుల సమీకరణ దిశగా చర్యల్ని స్పీడప్ చేయాలని సర్కారు ఆదేశించింది. హైదరాబాద్ మెట్రో తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో వైజాగ్ లైట్ మెట్రోను నిర్మించే అవకాశం ఉంది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలో మెట్రో ఏర్పాటై ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ నష్టాలు మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడం కోసం విశాఖ మెట్రోను నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇక, మెట్రోతో పాటు వైజాగ్ బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ ఏర్పాటు దిశగానూ జగన్ సర్కారు అడుగులేస్తోంది. 60.5 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లలో ట్రామ్ నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.