బీఆర్‌ఎస్ లో అంతర్గత వివాదాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “నన్నడానికి ఈ లిల్లీపుట్ ఎవరు?” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ “ఇన్‌సైడర్స్” తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ లేఖలు లీక్ చేశారంటూ ఆమె ఆరోపించారు. తనను పక్కన పెట్టే ప్రయత్నాలు తిరగబడతాయన్నారు. తాను కర్మపై నమ్మకం పెట్టుకున్నట్లు కవిత ఘాటుగా స్పందించారు. ఇక, కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తన పాత్రను గుర్తు చేస్తూ, “కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు” అని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ శత్రువులైన రేవంత్, జర్నలిస్ట్ రాధాకృష్ణలు తనపై చేసిన విమర్శలను మరొకసారి వల్లే వేసేందుకు కవిత చేసిన ప్రయత్నానికి తాను సానుభూతి తెలుపుతున్నానన్నారు. కవిత–జగదీష్ రెడ్డి వ్యాఖ్యల యుద్ధం బీఆర్‌ఎస్ లో వర్గపోరు మళ్లీ బహిర్గతం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తు దిశపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.