గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో అపురూపమైన విషయం. రక్తమాంసాలను పంచుకొని పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది తినకుండా డాక్టర్లు సూచించిన పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీలు హెల్త్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ టైమ్ లో తాజా పండ్లు తినడం చాలా ముఖ్యం. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఇది చాలా అవసరం కూడా. పండ్లలో అనేక విటమిన్స్, న్యూట్రియన్స్, మినరల్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కారణంగా మహిళల్లో వచ్చే మూడ్ స్వింగ్స్, కాళ్ల నొప్పులు, అలసటను కొన్ని తాజా పండ్లు దూరం చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరు పోషకాలను మాత్రం పక్కాగా తీసుకోవాలని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
గర్భిణీలు విటమిన్ ఏ, విటమిన్ డీ, ఫోలేట్ తో పాటు కాల్షియం, ఐరన్, ఓమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అయితే అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో రోజువారీ భోజనాల్లో ఈ పోషకాలు లేక గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. సప్లిమెంట్ల ద్వారా కూడా కావాల్సిన విటమిన్లు, పోషకాలు పొందొచ్చు. కానీ సరైన కాంబినేషన్ ఉన్న సప్లిమెంట్స్, ఆహారాలను గుర్తించడం కాస్త కష్టమనే చెప్పాలి. సప్లిమెంట్స్ అవసరం లేకుండా తక్కువ క్యాలరీలు, ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండే ఆహారాలు ఏంటనే దానిపై ‘ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ఒక కథనం ప్రచురితమైంది. కేథరిన్ సాడర్ నేతృత్వంలోని బృందం 2,450 మంది గర్భిణులపై ఒక రీసెర్చ్ చేసింది.
గర్భిణీలకు సరైన పోషకాలు, విటమిన్లు లభిస్తున్నాయా? అనే వివరాలను కేథరిన్ బృందం కనుక్కొంది. తద్వారా ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది? సప్లిమెంట్స్ ఏ మేరకు తీసుకోవాలి? అనేది తెలుసున్నామని కేథరిన్ సాడర్ అన్నారు. గర్భిణీలు రోజూ ఎలాంటి డైట్ తీసుకోవాలో ఉదాహరణగా కూడా చెప్పారు. విటమిన్ ఏను కలిగిన కప్పు పచ్చి క్యారెట్ తీసుకోవాలని అన్నారు. విటమిన్ డీ అధికంగా ఉండే పాలను ఒక గ్లాస్ మోతాదులో తాగాలని చెప్పారు. ఫోలిక్ యాసిడ్ కలిగి ఉండే చిక్కుళ్లను అరకప్పు తీసుకోవాలని సూచించారు. కాల్షియం కోసం ఒక కప్పు న్యూట్రిషన్ షేక్ తాగాలన్నారు. ఐరన్ ఉండే ఆహారం ఏదైనా ఒక కప్పు.. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన చికెన్ ఒక కప్పు తీసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు.