పంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వాటికి చెక్ పెట్టండిలా..!
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. స్త్రీ, పురుషులనే తేడాల్లేకుండా అందరికీ అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకే ఎన్నో బ్యూటీ టిప్స్ పాటిస్తూ అందాన్ని కాపాడుకుంటారు. అయితే అందం విషయంలో చాలా మంది ముఖానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ముఖంతో పాటు శరీరంలోని మిగిలిన అవయవాలు కూడా అందంగా కనిపిస్తేనే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారనేది తెలుసుకోరు. మనిషి అందంగా కనిపించాలంటే నవ్వు కూడా బాగుండాలి. మరి నవ్వుతున్నప్పుడు పళ్లు అసహ్యకరంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే పంటి అందం పైనా ఫోకస్ పెట్టాలి. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్రష్ చేయండిలా..!
పొద్దున లేస్తే ముందుగా అందరూ చేసేది పళ్లు తోముకోవడమే. బ్రష్ పట్టుకుని దానికి కొంత టూత్ పేస్ట్ రాసి, ఇష్టం వచ్చినట్లు తోముతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రష్‌ను దంతాల చుట్టూ గుండ్రటి ఆకారంలో తిప్పుతూ తోమాలి. చిగుళ్లకు బ్రష్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఉదయమే కాదు.. రాత్రి నిద్రపోయే ముందు కూడా పళ్లు తోముకోవాలి. ఇది పళ్లపై ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
నాలుకనూ క్లీన్ చేయాలి
నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పళ్లతో పాటు నాలుకనూ శుభ్రంగా ఉంచుకోవాలి. పళ్లను తోమిన ప్రతిసారీ నాలుకనూ బ్రష్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. దీంతో దానిపై బ్యాక్టీరియా నిల్వ కాకుండా చేయొచ్చు.
ఈ సూచనలను పాటించాల్సిందే!
పంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చక్కెర ఉత్పత్తులకు నో చెప్పాల్సిందే. ఒకవేళ షుగర్ ప్రొడక్ట్స్ తింటే వెంటనే నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ నోటిని కడుక్కోవడం మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా నోటి నుంచి దుర్గంధం రాకుండా చేయొచ్చని అంటున్నారు. దీంతో పాటు బ్రష్ చేయడానికి ముందు నీళ్లను తాగాలి. తద్వారా డ్రై మౌత్ ఇన్ఫెక్షన్లను కూడా రాకుండా చూసుకోవచ్చు.