ఆస్కార్‌కు అర్హత లేని సినిమాలు.. పరువు తీసుకుంటున్న ఫిల్మ్ ఫెడరేషన్
ప్రపంచ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ పురస్కారాల కార్యక్రమం ఇటీవలే జరిగింది. మార్చి 13న అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో చోటుచేసుకున్న ఈ అవార్డుల వేడుకలో భారత్ నుంచి రెండు సినిమాలు ఆస్కార్ను అందుకున్నాయి. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్కు ఆస్కార్ వరించింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ షార్ట్ ఫిల్మ్ కు పురస్కారం లభించింది. అయితే తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీపై ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. అర్హత లేని చిత్రాలను ఆస్కార్ కు పంపుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రెమ్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్యాలెంట్ను తొక్కేస్తున్నారు: ఏఆర్ రెహ్మాన్
ఆ ఇంటర్వ్యూలో మ్యూజిక్లో వస్తున్న ట్రెండ్స్ మీద మరో సంగీత దర్శకుడు ఎల్.సుబ్రహ్మణ్యంతో కలసి చర్చలో పాల్గొన్నారు రెహ్మాన్. ఈ సందర్భంగా ఆయన భారత ఫిల్మ్ ఫెడరేషన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాను కొన్ని మూవీస్ ఆస్కార్ కు వెళ్తాయని అనుకుంటానని.. కానీ ఆ సినిమాలు ఆస్కార్ కు నామినేట్ కావని రెహ్మాన్ అన్నారు. అదేంటో తనకు అస్సలు అర్థం కాదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ కొన్ని చెత్త సినిమాలకు ఆస్కార్ లు ఇచ్చారని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయని.. తాను వాటిని ఊహించుకుంటే అవి అసలు ఆస్కార్ వరకూ వెళ్లే చాన్స్ లేదన్నారు.
ఫెడరేషన్పై నెటిజన్స్ ఫైర్
అసలైన ప్రతిభను తొక్కేస్తున్నారని ఆ ఇంటర్వ్యూలో రెహ్మాన్ చెప్పుకొచ్చారు. రెహ్మాన్ చేసిన కామెంట్స్ రెండు నెలల కింద చేసినవి. కానీ ఇప్పుడు అవి ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఫిల్మ్ ఫెడరేషన్ ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ను సెలెక్ట్ చేయకుండా ఒక గుజరాతీ సినిమాను ఎంపిక చేసింది. దాన్ని ఉద్దేశించే రెహ్మాన్ ఈ కామెంట్స్ చేశారని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్స్ కూడా ఫిల్మ్ ఫెడరేషన్ పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మంచి సినిమాలకు, అవార్డులు వచ్చే సినిమాలను కాకుండా ఇతర చిత్రాలను ఆస్కార్స్కు పంపిస్తారంటూ ఫెడరేషన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులోనూ ప్రాంతీయ వివక్ష, రాజకీయాలు పనికిరావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్స్ రావాలంటే ప్రయోగాత్మక, మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలే అవసరం లేదని.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి కమర్షియల్ సినిమాకూ ఆ సత్తా ఉందని సూచిస్తున్నారు. ‘నాటు నాటు’ పాటకు అవార్డుతో ఫెడరేషన్ పరువు మంటగలిసిందని నెటిజన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు.