రాజా రాణి సినిమాతో తెలుగులో సైతం సూపర్ ఫాలోయర్లను సంపాదించుకున్న నటి నజ్రియా. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. నానితో డైరెక్ట్ తెలుగు మూవీ కూడా చేసింది నజ్రియా. గతేడాది సూక్ష్మదర్శిని సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నజ్రియా సోషల్ మీడియా, సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. తాజాగా నజ్రియా దీనిపై స్పందించింది. అందరికీ అందుబాటులో లేనందుకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. ‘‘నేను కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను. నా 30వ పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలు, నా చిత్రం సక్సెస్ మీట్‌లు.. ఇలా దేనికీ నేను హాజరుకాలేదు. ఎన్నో ముఖ్యమైన క్షణాలను మిస్ అయ్యాను. నా గురించి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు. వాళ్ల ఫోన్‌లకు నేను సమాధానం ఇవ్వలేదు. నాకు వారి సినిమాల్లో పాత్రలు ఇవ్వడం కోసం ఎంతోమంది ఫోన్‌లు చేశారు. వారి ఫోన్లు నేను తీయలేదు. ఈ విషయంలో అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఇది నాకు చాలా కఠినమైన సమయం. నేను త్వరలోనే కోలుకుని మీ ముందుకువస్తాను’’ అంటూ సోషల్ మీడియాతో పోస్టు పెట్టింది. ఈ పోస్టుకు స్టార్ హీరోయిన్ సమంత లైక్ కొట్టింది.