ఇంట్లో వారికి ఈ వివరాలు చెబుతున్నారా? లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు!
కరోనా మహమ్మారి ఎంతోమందిని మనకు దూరం చేసింది. ఆప్తులు, స్నేహితులు, కుటుంబీకులను మన నుంచి లాక్కుని వెళ్లిపోయింది. కొన్ని కుటుంబాల్లో అయితే ఆర్థికంగా చేదోడుగా నిలిచేవారు కూడా లేకుండా పోవడం వారిని తీవ్ర కష్టాల్లోకి నెట్టింది.
ఇలాంటి సమయంలో కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. కానీ, చనిపోయిన వారిలో చాలా మంది తమ ఆర్థిక విషయాలను ఫ్యామిలీ దగ్గర రహస్యంగా ఉంచడం పెద్ద సమస్యగా మారింది.
బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ మదుపు చేశారు? తమ పేర్ల మీద ఏయే ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి? లాంటి వివరాలను చాలా మంది తమ కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడం వంటి ఉదంతాలు అనేకం ఈమధ్య వెలుగులోకి వచ్చాయి. అప్పటికే కావాల్సిన వారిని కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులూ ఎదురైతే ఆ కష్టం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆ దుఃఖ సమయంలో వాటన్నింటినీ తవ్వితీయడం ఓ పెద్ద భారం అనే చెప్పాలి. అందుకే దురదృష్టవశాత్తు కుటుంబ పెద్దలు దూరమైనా.. కీలకమైన ఆర్థిక వివరాలు ఫ్యామిలీకి యాక్సెస్ చేసుకోగలిగే వెసులుబాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
దగ్గరి వారికి చెబితే బెటర్
భార్య, పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రులు.. ఇలా ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఆర్థిక అంశాల గురించి వివరించాలి. బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్ మెంట్స్, ఇన్సూరెన్స్, రుణాలు, బకాయిలు.. ఇలా అన్నింటికీ సంబంధించిన వివరాలను వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండటం బెటర్. అయితే, అవి మరొకరి చేతికి వెళ్లేందుకు ఛాన్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు ‘పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఫైల్’ను షేర్ చేయడం లాంటి చర్యలు తీసుకోవడం ఉత్తమం.
2019 మార్చి నాటికి ఆర్బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్నెస్ ఫండ్‌లో రూ.25 వేల కోట్లు ఉన్నాయి. సుమారు పదేళ్లుగా వీటిని ఎవరూ క్లెయిమ్ చేయలేదు. అంటే ఈ క్లెయిమ్ అమౌంట్ మొత్తం ఇప్పటికే అనేక కుటుంబాలకు చేరి ఉండాల్సింది. కానీ, ఆయా కుటంబాలకు బహుశా ఈ విషయం తెలియకపోవడం వల్లే నిధులు అలా పేరుకుపోయి ఉండొచ్చు. అందుకే దురదృష్టవశాత్తూ ఫ్యామిలీ ఓ ఒక వ్యక్తి లేకుండా పోయినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఆర్థిక పరమైన విషయాలను ఎవరో ఒకరికి చెప్పి ఉంచాలి.
నామినీని ఎంచుకోండి
ప్రతి పొదుపు, మదుపు అకౌంట్‌కు కచ్చితంగా నామినీ ఉండాలి. ఇప్పటికే ఈ పని చేస్తే ఓకే.. లేదంటే వెంటనే చేయండి. వీలైనంత వరకు నామినీగా ఫ్యామిలీలోని వ్యక్తినే ఎంపిక చేసుకుంటే బెటర్. కష్ట సమయంలో వారే అకౌంట్లు, ఇన్వెస్ట్ మెంట్ లకు సంరక్షకులుగా ఉంటారు. ఒకవేళ నామినీలే చట్టబద్ధమైన వారసులైతే.. ఆస్తులను వారికి బదిలీ చేయడంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని గుర్తుంచుకోండి. అందుకే నామినీలను ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే తర్వాత చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
వీలునామాను నిర్లక్ష్యం చేయొద్దు
తమ తదనంతరం ఆస్తులు ఎవరికి దక్కాలి, తమ ప్రాపర్టీస్‌కు వారసులు ఎవరనేది వివరించే వీలునామాను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ, కరోనా మహమ్మారి దీని ఆవశ్యకత ఏంటో అందరికీ తెలియజేసింది. వారసుల మధ్య తర్వాత ఎలాంటి గొడవలు రాకుండా ముందే జాగ్రత్త వహించడం మంచిది. ఎవరికి ఏయే ఆస్తి దక్కాలి, ఎంత వాటా చెందాలనేది ముందే నిర్ణయిస్తే బెటర్. వీలునామాను రిజిస్టర్ చేయించడం గుర్తు పెట్టుకోండి. కొన్నిసార్లు ఆస్తి తగాదాలు కోర్టు వరకు వెళ్తాయి. అలాంటి టైమ్ లో రిజిస్టర్ అయిన వీలునామాను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుంది. లాయర్ ను సంప్రదిస్తే దీనిపై మరింత స్పష్టత వస్తుంది.
లాకర్ అకౌంట్స్‌తో జాగ్రత్త..
బంగారం, డబ్బులు, కీలక పత్రాల విషయంలో కొందరు జాగ్రత్త వహిస్తారు. వాటిని లాకర్ లో దాచిపెడతారు. ఒకవేళ లాకర్ అకౌంట్ ఒకరి పేరుమీదే ఉంటే.. వారు దూరమైతే డెత్ సర్టిఫికేట్ ను సమర్పించి నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. ఒకవేళ జాయింట్ అకౌంట్ ఉంటే మాత్రం.. ఖాతా తెరిచేటప్పుడే యాక్సెస్ అనే ఆప్షన్ దగ్గర ‘ఎయిదర్ ఆర్ సర్వైవర్’ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే జాయింట్ అకౌంట్ అయినప్పటికీ.. ఇద్దరిలో ఎవరో ఒకరు దూరమైతే కచ్చితంగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందే.
కఠిన చర్యలు తప్పవు
కుటుంబంలో ఓ వ్యక్తి లేకపోయినా.. వారి డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చని అనుకుంటే మాత్రం పొరపాటే. అలా చేస్తే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. ఆ విషయం బ్యాంకు దృష్టికి వెళ్తే కఠిన చర్యలు తప్పవు. అదే సమయంలో నామినీలు కూడా ఈ విషయంపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.