ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లా సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వేపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిక్నిక్ ముగించుకుని తిరిగి వస్తున్న స్కూల్ విద్యార్థుల బస్సును ఠఠియా పోలీస్ స్టేషన్ పరిధిలోని 209వ కిలోమీటర్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆగ్రాకు చెందిన పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిపి సుమారు 56 మంది కౌశాంబికి పిక్నిక్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఎక్స్ ప్రెస్ వేపై బస్సును నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

