తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. మోకాలి మిట్ట ప్రాంతంలో వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో చిరుత కనిపించినట్లు సమాచారం. ఆ సమయంలో భక్తుల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిరుత సంచారం విషయం తెలియడంతో నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు మరియు అటవీ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిసర ప్రాంతాల్లో నిఘాను పెంచారు.
చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి మార్గంలో వెళ్లే భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా మాత్రమే ప్రయాణించాలని కోరారు. చిన్న పిల్లలతో వెళ్లే తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నుంచి దూరంగా వెళ్లనివ్వవద్దని సూచించారు. నడక మార్గంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనుమానాస్పదంగా జంతువులు కనిపించినా లేదా వాటి కదలికలు గుర్తించినా వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

