తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డుపై ఒడిశా ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జైపూర్‌కు వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ తక్షణమే బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా దించేశాడు. సాలూరు అగ్నిమాపక బృందం వెంటనే స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో పెద్ద ప్రమాదం నివారణ అయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.

