మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఒక నెల రోజులుగా కొనసాగుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ప్రజల ఆవేదనలను పట్టించుకోవడం లేదని కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలను తరలించే ప్రభుత్వ చర్యలు ప్రజల ఆరోగ్య సేవలను మరింత దెబ్బతీస్తాయని, ఈ ప్రాంతంపై ఎందుకు ఇంత కక్ష్యగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మెడికల్ కాలేజీలకు అత్యాధునిక పరికరాలు సమకూర్చారని, 17 కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు 8,480 కోట్లు పెట్టుబడి పెట్టారని గుర్తుచేశారు. “కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా 2,403 కోట్లతో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాం. ఐదు కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి, పులివెందులతో పాటు పాడేరు కాలేజీలకు NMC 50 MBBS సీట్లు కేటాయించింది. కానీ కూటమి ప్రభుత్వం ఈ సీట్లను తిరస్కరించి, ప్రైవేటీకరణ మార్గంలో దోషం చేస్తోంది” అని విమర్శించారు.

