కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు తీవ్రతరం చేశారు. విజయవాడ, బెంగళూరు హైవేలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్, ఎల్బీ నగర్‌లోని చింతలకుంట వద్ద బస్సులను పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లు, వాహన నిబంధనలను తనిఖీ చేసిన అధికారులు, నిబంధనలు అతిక్రమించిన ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఒక బస్సు అద్దం పగిలినా నడుపుతుండగా, దాన్ని సీజ్ చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆర్సీ, ఫిట్‌నెస్, బీమా, పర్మిట్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే, ప్రమాదం తర్వాతే అధికారులు చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

