స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవ హారం కార్యక్రమం దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు ఆదిత్య పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే!” అంటూ ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేసిన ఆదిత్య, “కేవలం నా అమ్మ ఒక్కరే పోరాడితే సరిపోదు. ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు కీలకం,” అని పిలుపునిచ్చాడు. బీఆర్‌ఎస్‌లో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కవితను ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న కవిత, ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సమయంలో విదేశాల్లో చదువుకుని ఇటీవల భారత్‌కు తిరిగొచ్చిన ఆదిత్య, ఊహించని విధంగా బంద్ మరియు ధర్నాల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 20 ఏళ్ల వయసులోనే ఆదిత్య రాజకీయ ఎంట్రీ ఇస్తున్నాడా? అనే ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి.