కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) బలహీనపరిచి, అవినీతిని బహిర్గతం చేసే కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్, మధుసత్యం గౌడ్, కొమురయ్యలతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భోపాల్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త శెహ్లా మసూద్ సహ చట్టం సాయంతో అక్రమ మైనింగ్‌ను బహిర్గతం చేయగా, ఆమెను కాల్చి చంపిన ఘటనను ఆయన గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం సహ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పటికీ, భాజపా ప్రభుత్వం దానిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర సమాచార కమిషన్‌లో 11 పోస్టుల్లో కేవలం ఇద్దరు కమిషనర్లతోనే పనిచేస్తున్నారని, ప్రధాన సమాచార కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం దుర్మార్గమని, ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడిచేలా సవరణలు చేసి కమిషనర్ల స్వతంత్రతను బలహీనపరిచారని ఆరోపించారు. ఈ సవరణలను రద్దు చేసి, సమాచార కమిషనర్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు. వ్యక్తిగత సమాచారం పేరుతో ప్రజా ప్రయోజన సమాచారం ఇవ్వకుండా నిరాకరించే అవకాశం ఏర్పడిందని, కమిషన్ పనితీరుకు నిర్దిష్ట ప్రమాణాలు నిర్ణయించి వార్షిక నివేదికలను తప్పనిసరి చేయాలని ఆయన కోరారు. మంత్రి పొంగులేటిపై సహచర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఫిర్యాదు విషయంపై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ, అది పార్టీలో అంతర్గత సమస్య అని, చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని మహేశ్‌కుమార్ గౌడ్ సమాధానమిచ్చారు.