జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న, ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉప ఎన్నిక కోసం షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఆర్‌డీఓ సాయిరాం నామినేషన్ల స్వీకరణ బాధ్యతలు నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి తీవ్రమైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది, అధికార-ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేశాయి.