విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళుతుండగా, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయనను కలిసి ప్లాంట్‌ను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. కాకానినగర్ వద్ద నిరీక్షించిన కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విభాగాల వారీగా ప్రైవేటీకరణ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మార్చేలా ఒత్తిడి తెచ్చేందుకు, ప్లాంట్‌కు ప్రత్యేక గనుల కేటాయింపు, సెయిల్‌లో విలీనం, తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వినతులపై సానుకూలంగా స్పందించిన జగన్, కార్మికుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ కార్మికులకు తోడుగా ఉంటుందని, ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కలసికట్టుగా పోరాటం చేస్తామని గట్టి భరోసా ఇచ్చారు.