ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లోకి మార్చాలనే ప్రయత్నాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు ద్రోహం చేసే కుట్ర అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైద్య సంస్థలు ప్రైవేట్ అయితే, అధిక ఫీజుల కారణంగా సామాన్యులు వైద్య సేవలు పొందలేకపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చామని జగన్ గుర్తు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు భారీ మొత్తాలు వసూలు చేస్తాయని, అందుకే ప్రభుత్వ కాలేజీలు అవసరమని పేర్కొన్నారు. నర్సీపట్నంలో 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కాలేజీకి కోవిడ్ కాలంలో రూ.500 కోట్లు వెచ్చించామని, పూర్తయిన తర్వాత 600 బెడ్లతో పేదలకు ఉచిత చికిత్స అందిస్తుందని వివరించారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం ఎలా అందుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్, రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, వీటిలో ఏడు పూర్తి అయ్యాయని తెలిపారు. అందులో ఐదింటిలో 2023-24 అకాడమిక్ ఇయర్‌లో తరగతులు మొదలయ్యాయని, విజయనగరం, పాడేరు కాలేజీలలో కూడా క్లాసులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అమరావతి నిర్మాణానికి లక్షల ఎకరాల భూమి, రోడ్లు, డ్రైనేజీలకు భారీ నిధులు కేటాయిస్తున్నా, మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు (సంవత్సరానికి 1,000 కోట్లు) ఖర్చు చేయకుండా ప్రైవేట్ చేతుల్లోకి తరలించడం అన్యాయమని విమర్శించారు. ఈ మెడికల్ కాలేజీలు పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అవకాశాలు అందించే దేవాలయాల వంటివని, వీటిని రాజకీయ లాభాల కోసం ప్రైవేట్ చేయడం సహించలేమని జగన్ అన్నారు.