ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించి భయాందోళనలు నెలకొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైంది. 8 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిన ఈ భూకంపం జలాలాబాద్‌కు తూర్పు-ఈశాన్యంగా సుమారు 27 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రకంపనల కారణంగా కనీసం 9 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు నంగర్హార్ ప్రజారోగ్య శాఖ ప్రతినిధి నకిబుల్లా రహీమి వెల్లడించారు.భూకంపం ప్రభావం భారత్, పాకిస్తాన్ దేశాల్లోనూ తీవ్రంగా అనుభవించబడింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, నోయిడా సహా పలు ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికొచ్చి రోడ్లపైకి చేరి భయాందోళనకు గురయ్యారు. అయితే, భారత్‌లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. అక్కడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులో ఉంచేందుకు స్థానిక ప్రభుత్వాలు, రక్షణ బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ భూకంప ప్రభావానికి అధికంగా గురయ్యే ప్రాంతాలలో ఒకటని, ఈ తరహా ప్రకంపనలు తరచూ సంభవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ తాజా ఘటన మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేసింది.