ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా విశాఖపట్నం అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్‌తో పాటు విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్‌టోక్, ఇటానగర్ నగరాలు కూడా టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపూర్, ఫరీదాబాద్, కోల్‌కతా, శ్రీనగర్ నగరాలు దిగువ స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన NARI 2025 సర్వే ఆధారంగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో స్మార్ట్ సిటీ విశాఖపట్నం అగ్రస్థానం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో మహిళా భద్రతా స్కోరు 65 శాతం నమోదైంది. విశాఖలో షీ టీమ్స్, డ్రోన్ సర్వైలెన్స్, శక్తి యాప్, బీచ్ పాట్రోలింగ్ వంటి వినూత్న చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు, కాలేజీలు–పాఠశాలల వద్ద ఈవిటీజర్లపై కఠిన చర్యలు, రైల్వే స్టేషన్లు–బస్టాండ్లలో భద్రతా నెట్‌వర్క్ బలోపేతం వంటి చర్యలు తీసుకోవడంతో ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ మాట్లాడుతూ, విద్య, ఆరోగ్యం, ఉపాధి, రాకపోకల విషయంలో మహిళల భద్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. శారీరక, మానసిక, ఆర్థిక, డిజిటల్ భద్రత అందరికీ సమానంగా అవసరమని, దీనికి సమాజం మొత్తం సహకరించాలని పిలుపునిచ్చారు.