పులివెందుల ఉప ఎన్నికల గురించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమాన్నీ వైసీపీపై బురదజల్లే వేదికగా మార్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఇంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని, ఓటు హక్కు వినియోగించిన ప్రజలను కూడా అనుమానాస్పదంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ క్యూలో నిలబడి ఓటు వేసిన ఫొటోలు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారం చేయడం దౌర్భాగ్యమని అంబటి వ్యాఖ్యానించారు. అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. “మీ కుటుంబ విషయాలు చూసుకుని మాట్లాడండి. ఎన్నికల తర్వాత పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో 12.5 శాతం ఎక్కువ ఓట్లు రావడం ఎలా జరిగిందో చెప్పాలి” అని ప్రశ్నించారు. జగన్ చేసిన “చంద్రబాబు, రేవంత్, రాహుల్ హాట్‌లైన్‌లో ఉన్నారు” అనే వ్యాఖ్య పూర్తిగా నిజమని ఆయన సమర్థించారు. చంద్రబాబు ఎప్పుడూ అవసరం అనిపిస్తే పార్టీలు మార్చే వ్యక్తి అని, సిద్ధాంతం, నిబద్ధత లేని నాయకుడని అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.