వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపాన్ని అనుభవించింది. ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.గ్రామస్తుల వివరాల ప్రకారం, కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉంచిన సామాన్లు కిందపడిపోయాయి. ఆకస్మిక ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.ఒకవైపు నిరంతర వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు భూకంపం సంభవించడం స్థానికులను మరింత భయపెట్టింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమాచారాన్ని సేకరిస్తూ, ప్రకంపనల తీవ్రత, కేంద్రబిందువు వివరాలను అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భూకంపాల సమయంలో భద్రతా సూచనలు పాటించాలని అధికార యంత్రాంగం సూచించింది.