బంగాళాఖాతంలోని పశ్చిమమధ్య, వాయువ్య ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తాంధ్రలో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ విభాగం ప్రకారం, ఈరోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.