ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఆస్తి కోసం కన్న తల్లిపైనే కొడుకు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన జక్కు లక్ష్మీనరసమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లయి చాలాకాలమైంది. భర్త మృతి చెందడంతో ఆమె తన ఇల్లు వదిలి వేరే చోట నివసిస్తోంది. కొడుకు శివాజీకి కూడా పెళ్లయింది. భార్యతో కలిసి వేరే కాపురం పెట్టుకున్న శివాజీ, తల్లి లక్ష్మీనరసమ్మ వద్ద ఉన్న ఇల్లు సహా ఆస్తులను తన పేరిట రాయాలని డిమాండ్ చేస్తూ తరచూ వేధిస్తున్నాడు. దేవరపల్లి మండలం బుచ్చయ్యపాలెంలో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న శివాజీ, ఇటీవల పని మానేసి తల్లిని ఆస్తుల కోసం ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో నిన్న మధ్యాహ్నం గ్రామంలో రోడ్డు మీదనే కొడవలితో తల్లిపై దాడి చేశాడు. తల, మెడ, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మీనరసమ్మ రక్తస్రావంతో కుప్పకూలింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యుల ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం శివాజీ పరారీలోకి వెళ్లగా, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. “కన్న తల్లి మీద ఇలా దాడి చేసిన కొడుకును కఠినంగా శిక్షించాలి” అని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.