అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీ సుంకాలను విధిస్తానన్న హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో భారత్–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ట్రంప్ బెదిరింపులకు వెనుకాడని భారత్, రష్యాతో సంబంధాలను గట్టిపరచే దిశగా కీలక అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ముందే ఖరారైనప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యల తర్వాత దీని ప్రాధాన్యం పెరిగింది. రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ కథనం ప్రకారం, దోవల్ పర్యటనలో వ్యూహాత్మక ఒప్పందాలు, రక్షణ సంబంధిత కీలక అవగాహన పత్రాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.