అడవి ఏనుగుల నుంచి పంటలను రక్షంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి ఏపీకి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాయి. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్ లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయి. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పని చేస్తుంది అనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలు, కావడిలకు అభినందనలు తెలియజేశారు. అలాగే అడిగిన వెంటనే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి ఇచ్చి సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.