మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఒక భయంకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఐదుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక దంపతులు కొడుకు, ఇద్దరు కూతుర్లతో కలిసి జడ్చర్లలోని ఒక కాలనీలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం బాలిక తండ్రి పని నిమిత్తం బయటకు వెళ్లగా, తల్లి పెద్ద కూతురిని అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 9 ఏళ్ల చిన్నారిపై 4వ, 5వ తరగతుల్లో చదువుతున్న నలుగురు బాలురు, ఇంటర్ చదువుతున్న ఒక బంధువు (16) కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని బుధవారం ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు వైద్యులు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, ఐదుగురు మైనర్లపై పోక్సో చట్టం కింద గ్యాంగ్ రేప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జడ్చర్లలో కలకలం రేపగా, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై జరిగిన ఈ దారుణానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.