జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివారులో సోమవారం ఉదయం భారత భద్రతా దళాలు ఒక భారీ ఎన్‌కౌంటర్ చేపట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన వారంతా గత ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి సంబంధితవారని ఆర్మీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురైంది. అప్పటి నుంచి నిందితుల కోసం భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ “మహాదేవ్”ను ప్రారంభించాయి. శ్రీనగర్‌కు సమీపంలోని దచిగామ్ నేషనల్ పార్క్ వద్ద హర్వాన్-లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న గూఢచార సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు కనిపించగానే కాల్పులు ప్రారంభమయ్యాయి. భీకరంగా సాగిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆర్మీ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడిపై జూలై 28న పార్లమెంట్‌లో చర్చ జరుగనుండగా, ఇదే రోజు దాడిలో పాల్గొన్నవారిని మట్టుబెట్టడం గమనార్హం.