జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా కొనసాగుతూనే పార్టీకి స్వతంత్ర శక్తిగా పరిపక్వత ఇవ్వాలనే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా జనసేన కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు అదనంగా మరో 60 నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టే కార్యక్రమం రూపొందించారు. వీటిలో పార్టీకి బలం ఉన్న 50 స్థానాలను గుర్తించి ప్రత్యేక ప్రణాళికలతో కార్యకలాపాలను ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా పార్టీ ఇంచార్జ్‌ల నియామకం చేపట్టేందుకు సిద్ధత వహిస్తున్నారు. అలాగే ప్రజల మధ్యలోకి వెళ్లేలా “ఇంటింటికీ జనసేన” కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న యోచనలోనూ ఉన్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వడం, గ్రౌండ్ లెవల్ లో మద్దతును బలపరిచే చర్యలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యాన్ని పెంచేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కూటమిలో ఉన్నా, జనసేన స్వతంత్ర శక్తిగా కొనసాగేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.