గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో దారుణం జరిగింది. ఓ పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో వంతెన పై నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పుడు వంతెనపై ఉన్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 1985లో ఈ వంతెన నిర్మించారు. శిథిలావస్థకు చేరుకున్న వంతెన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కూలిపోయింది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.