ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని, ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని, మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమన్నారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ మంత్రి నారా లోకేశ్‌పై సెటైర్లు వేశారు.