సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరిగేందుకే సరిపోతుందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి పల్లెలపై పట్టింపు ఎక్కడ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల్లో చెత్త సేకరించే ట్రాక్టర్ డ్రైవర్లకు జీతాలు చెల్లించకపోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తెస్తానన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. ట్రాక్టర్ లో డీజిల్ లేక 20 రోజుల నుంచి చెత్త సేకరణ చేయడం లేదన్నారు. గ్రామాలు స్వచ్చంగా ఉండాలని కేసీఆర్ ట్రాక్టర్లు ఇస్తే అందులో డీజిల్ కూడా పోయని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని విమర్శించారు. సఫాయి కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. గ్రామపంచాయతీ సెక్రెటరీ అప్పుచేసి రూ.80,000 గ్రామ పంచాయతీ నిర్వహణకు ఖర్చు చేస్తే, ఆ డబ్బులు వస్తాయో రావో అని ఆందోళన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో చిప్పల్ తుర్తి గ్రామ పరిస్థితే కాదు, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిస్థితి ఇదే విధంగా ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటని పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో కనీసం వీధి లైట్లు పెట్టడానికి కూడా డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారని, మీకు హెలికాప్టర్ లో ఇంధనం పోయడానికి డబ్బులు ఉంటాయి కానీ ట్రాక్టర్ లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి తిరగడానికే సరిపోతుందని, ఇంకా గ్రామాలను పట్టించుకునే సమయం ఉంటుందా అని సెటైర్లు వేశారు.