ఆటో మొబైల్ రంగంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ సెక్టార్ లో ఎన్నో కొత్త సంస్థలు ఇలా ఎంట్రీ వచ్చి, అలా ఎగ్జిట్ అయి వెళ్లిపోయాయి. కానీ కొన్ని బ్రాండ్లు మాత్రమే దశాద్దాలుగా కంటిన్యూ అవుతున్నాయి. కస్టమర్ల ఆదరణ ఉన్న కంపెనీలు మాత్రమే ఆటో మొబైల్ రంగంలో ఎక్కువ కాలం మనుగడ సాగించగలవు. అలాంటి బ్రాండ్లలో ఒకటి టొయోటా అని చెప్పొచ్చు. ఈ జపనీస్ బ్రాండ్ వెహికిల్స్ కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.
కిచిరో టొయోడా నెలకొల్పిన టొయోటా ఇవాళ గ్లోబల్ ఆటో మొబైల్ టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా కార్లను తయారు చేయడం టొయోటాకు వెన్నతో పెట్టిన విద్య. సరసమైన ధరల్లో వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం, క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకపోవడం టొయోటా స్టైల్. అందుకే ఈ బ్రాండ్ తయారు చేసిన కార్లు ఏటా లక్షలాదిగా అమ్ముడుపోతున్నాయి.
క్రూజర్ మినీ వచ్చేస్తోంది
ఇండియాలోనూ టొయోటా కార్లు బాగా ఫేమస్. భారతీయ కస్టమర్లకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ సేల్స్ లో నంబర్ వన్ అయిన సుజుకీ కంపెనీతో చేతులు కలిపింది టొయోటా. ఈ రెండు సంస్థలు కలసి ఇప్పటిదాకా పలు కార్లు తయారు చేశాయి. వాటిలో మారుతీ సుజుకీ బలెనో-టొయోటా గ్లాంజా ఒకటి. టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్-మారుతి సుజుకీ గ్రాండ్ విటారా రెండోది. టొయోటా ఇన్నోవా హైక్రాస్-మారుతి సుజుకీ ఇన్ విక్టో కూడా ఇందులో ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి సుజుకీకి పోటీగా ఒక కొత్త కారును తీసుకొస్తోంది టొయోటా. దాని పేరు టొయోటా లాండ్ క్రూజర్ మినీ.
జిమ్నీ కంటే పెద్దదే!
లాండ్ క్రూజర్ మినీని లైఫ్ స్టైల్ కాంపాక్ట్ ఆఫ్ రోడర్ గా రూపొందిస్తోంది టొయోటా. హైబ్రిడ్ (పెట్రోల్/డీజిల్ వెర్షన్)తోపాటు ఎలక్రిక్ పవర్ ఆప్షన్స్ తో దీన్ని తీసుకురానున్నారట. వచ్చే ఏడాది ఇది మార్కెట్ లోకి రానుందని సమాచారం. దీన్ని లైట్ క్రూజర్ లేదా యారిస్ క్రూజర్ గా పిలుస్తారని వినికిడి. ఇందులో రూఫ్ ఆప్షన్ కూడా ఉండేలా డిజైన్ చేస్తుండటం విశేషం. ఐదు డోర్లు ఉండే సుజుకీ జిమ్నీ కంటే సైజులో లాండ్ క్రూజర్ మినీ మరింత పెద్దగా ఉంటుందట. బండి ఎక్స్ టీరియర్ ను పూర్తిగా కాంపాక్ట్ క్రూజర్ కాన్సెప్ట్ లో తయారు చేస్తుండటం మరో స్పెషాలిటీగా చెప్పొచ్చు.