ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీంట్లో భాగంగా కవిత మందీమార్బలంతో హస్తినకు వెళ్లొచ్చారు. మహిళల దినోత్సవం కలసిరావడంతో పనిలోపనిగా అక్కడ దీక్ష కూడా చేశారు. మహిళల రిజర్వేషన్ కోసం ఆమె దీక్ష చేసినట్లు పైకి కనిపించినా.. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకే అలా చేశారనేది రాజకీయ విశ్లేషకుల వాదన.
కవిత వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ అభాసు పాలైంది. ఈడీ నోటీసులు ఇవ్వడానికి ఎంతోకాలం ముందే అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. కవితకు ఉత్తర్వులు వచ్చిన సమయంలోనూ బండి సంజయ్ లాంటి నేత ‘కవితను అరెస్ట్ చేయకుండా.. ముద్దు పెట్టుకుంటారా?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూశాం. ఇక, ఈడీ విచారణలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. కానీ రాష్ట్ర మరో బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ మాత్రం అంతా దగ్గరుండి చూసినట్లు మాట్లాడుతున్నారు.
ఈడీ విచారణకు తన భర్తతో పాటు లాయర్లను వెంటపెట్టుకుని వెళ్లారు కవిత. కానీ కవితను మాత్రమే అనుమతించారు అధికారులు. అలాంటప్పుడు లోపల ఏం జరిగిందనేది ఆమెకు మాత్రమే తెలియాలి. మరి, ధర్మపురి అర్వింద్కు లోపల ఏం జరిగిందనే సంగతి ఎవరు చెప్పినట్లు! కవిత ఈడీ విచారణకు సహకరించలేదని.. ఏం అడిగినా సరే.. తెలియదు, మర్చిపోయానని ఆమె చెప్పారని అర్వింద్ వ్యంగ్యంగా మాట్లాడారు. మరి, విచారణకు ఆమె సహకరించిందో లేదోననేది ఆయనకు ఎలా తెలిసింది? స్వయంగా ఈడీ అధికారులు చెబితే తప్ప ఈ వివరాలు ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
రామచంద్ర పిళ్లైపై కేసీఆర్, కవిత కలసి ఒత్తిడి తీసుకొచ్చారని.. అందుకే ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకున్నారని అర్వింద్ అనడం కూడా హాస్యాసప్పదంగా మారింది. పిళ్లై ఏమీ చిన్న పిల్లాడు కాదు కదా.. ఏది పడితే అది మాట్లాడటం సబబు ఎలా అవుతుంది? అసలే ఈడీ, సీబీఐ లాంటి సహా దర్యాప్తు సంస్థలు.. ప్రధాని మోడీ, బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్లో ‘ఈడీ ఇన్వెస్టిగేషన్లో ఇలా జరిగింది’ అంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ మాట్లాడితే ఈ ఆరోపణలన్నీ నిజమేనని అనుకునే ప్రమాదం ఉంది. ఎంతో రహస్యంగా సాగే విచారణ గురించి అర్వింద్ పూసగుచ్చినట్లు చెప్పడం చూస్తుంటే.. మోడీ పర్యవేక్షణలోనే ఈడీ పనిచేస్తోందనే ప్రజలు నమ్మడంలో అంత వింతేముందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.