గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏ చిన్న చాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెడదామా అంటూ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చాలాసార్లు ప్రయత్నించి బొక్కబోర్లా కూడా పడ్డాయి. అవి ఎంతగా ప్రయత్నించినా వైసీపీ సర్కారు, సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అసెంబ్లీ సెషన్స్లోనూ ఇలాగే ప్రయత్నించి మరోమారు భంగపడింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ వచ్చి ప్రసంగం చేయడం మామూలగా సంప్రదాయం. రాష్ట్ర గవర్నర్‌కు సీఎం, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు స్వాగతం చెప్పి సభలోకి తీసుకొస్తారు. వస్తారు. ఇది సాధారణంగా ఎప్పుడూ జరిగే విషయమే. ఈసారి గవర్నర్ కాస్త భిన్నంగా స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి కాసేపు ఉన్నారు. ఇలాంటి ఘటనలను రిపోర్టు చేయడంలో తప్పు లేదు.
కానీ ఇలాంటి ఘటనలను వక్రీకరించి, జరగని దానిని జరిగినట్లు టీడీపీ సభ్యులు ఆరోపించడం, దాన్ని ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ప్రచురించడం చాలా పెద్ద తప్పు అనే చెప్పాలి. గవర్నర్ తన వ్యక్తిగత అవసరం రీత్యా స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లారని సమాచారం. ఆ సందర్భంగా వీరంతా కొన్ని నిమిషాలపాటు అక్కడే కూర్చున్నారు. ఆ తర్వాత శాసనభలోకి వచ్చి ఇరు సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన గొంతు నొప్పితో బాధపడుతూ అప్పుడప్పుడూ మంచినీళ్లు తీసుకోవడాన్ని అందరూ చూశారు. ఈ వ్యవహారంపై కేశవ్‌కు ఎవరు బ్రీఫ్ ఇచ్చారో తెలియదు గానీ, ఆయన క్లారిటీ లేకుండా గవర్నర్‌కు అవమానం జరిగిందని మీడియా ముందుకు వచ్చి కామెంట్స్ చేశారు.
ఏదీ తెలుసుకోకుండానే ఎలా రాస్తారు?
సీఎం జగన్ కోసం గవర్నర్ నజీర్ ఎదురు చూశారని కేశవ్ ఆరోపించారు. ఈ వార్తను ఈనాడు దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియా వాళ్లు ఎవరైనా సరే దాని గురించి ఆనుపానులు తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ, బహుశా టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా గనుక.. తమకు తలనొప్పి వస్తుందేమోనని భయపడి కేశవ్‌కు చెప్పి మాట్లాడించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలోనూ ఇలా చాలాసార్లు మీడియా చెప్పే మాటలు నమ్మి నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అప్పట్లో ఏదైనా తేడా వస్తే తాను అలా అనలేదని బుకాయించడానికి చాన్స్ ఉండేది. ఆ రోజుల్లో సోషల్ మీడియా, వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉండేది కాదు.
కేశవ్పై వైసీపీ సీరియస్!
అందుకే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసేసి తప్పించుకునేవారు నేతలు. కానీ, ఇప్పడు సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. పూర్తి స్థాయిలో వీడియో చిత్రీకరణ కూడా జరుగుతోంది. ఏపీ అసెంబ్లీలోకి గవర్నర్ కాన్వాయ్ వస్తున్న సీన్స్ మొదలు తిరిగి ఆయన వెళ్లిపోయేంత వరకు అంతా వీడియో రికార్డు అయ్యింది. దీంతో కేశవ్ చేసిన ఆరోపణలపై గవర్నమెంట్ సీరియస్ అయ్యింది. ఇది కేశవ్ చెబితే రాశారా? లేదా ఈనాడు తప్పుడు కథనం రాసిందా? అన్నది తేల్చాలని, వీరిపై సభా హక్కుల ఉల్లంఘన పెట్టాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో సహా పలువురు వైసీపీ నాయకులు, మంత్రులు సర్కారును డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దీని మీద విస్తృతంగా చర్చ కూడా జరిగింది. ఈనాడు అధినేత రామోజీరావు పదేపదే అసత్య వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో రామోజీని సభకు రప్పించాలనీ కొందరు డిమాండ్ చేశారు. కేశవ్ దీనిపై బదులిస్తూ తొలుత అటుఇటుగా మాట్లాడినా.. ఆయన మీడియాతో చెప్పిన విషయాలను బుగ్గన ప్రదర్శించడంతో అవాక్కయ్యారు.
ఈ అంశంపై కేశవ్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా.. వైసీపీ నేరుగా గవర్నర్‌ను కించపరిచారని అన్నారా? లేదా? మీరు అనకపోతే ఈనాడు కావాలని తప్పుడు వార్త రాసిందా? క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో టీడీపీ, ఈనాడు పత్రిక పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డాయి. కేశవ్ చేసింది గవర్నర్‌ను కించపరిచే విధంగా ఉందని, అందువల్ల ఆయనను, ఆ మీడియా మీటింగ్లో పాల్గొన్న మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని సభ నుంచి ఈ సెషన్ పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారాం సమ్మతించారు. వీరి సస్పెన్షన్ మీద ఆందోళనకు దిగిన ఇతర టీడీపీ సభ్యులనూ ఓ రోజుపాటు సస్పెండ్ చేశారు.