నంద్యాల నుంచి మంచు మనోజ్ పోటీ!
రెండు రోజులుగా మంచు మనోజ్, భూమా మౌనికల వివాహం వార్తలు రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారాయి. ఇటీవల వీరి వివాహాం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఆ తరువాత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైరల్ అయ్యాయి. వివాహం అనంతరం మనోజ్, మౌనిక దంపతులు కర్నూలు, తిరుపతిలో పర్యటించారు. మనోజ్ దంపతులు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్న విషయాలు కూడా ముందుగానే మీడియా కి సమాచారం ఇస్తూ, ఫోటోస్ వెంట వెంటనే పంపిస్తూ మనోజ్ పి.ఆర్ టీము అన్నీషేర్ చేశారు. ఈ హడావుడి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మంచు మనోజ్ నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారన్న వార్త ఒక్కటి గుప్పుమంది. త్వరలోనే మంచు మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వుంది అని, అధికారికంగా తానే చెప్తాడు అని కూడా అంటున్నారు. దానికి నాంది గానే ఈ పర్యటనలు అన్నీ అని అంటున్నారు.
భూమా, మంచు ఫ్యామిలీలకు వైఎస్సార్ కుటుంబంతో బంధుత్వం ఉంది. అయితే విభేదాలతో భూమా కుటుంబం ఆ బంధాన్ని తెంచుకోగా.. మంచు ఫ్యామిలీతో మాత్రం కొనసాగుతోంది. దివంగత భూమా నాగిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేరున్న నేత. రాయలసీమలో ఓ వెలుగు వెలిగారు. ఆయన జీవితంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. భూమా నాగిరెడ్డికి కూడా ప్రేమ వివాహమే. కర్నూల్ జిల్లా కొత్తపల్లె గ్రామంలో జన్మించారు. నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డి ఫ్యాక్షన్ లీడర్ కావడంతో తన కొడుకు ఫ్యాక్షన్ కు దూరంగా ఉంచాలని చెన్నైలో చదివించారు. మెడిసిన్ కోసం బెంగళూరులో ఉండగా.. నాగిరెడ్డి తండ్రి హత్యకు గురయ్యారు.దీంతో చదువు మానేసి సొంతూరు వచ్చేశారు. కర్నూల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎస్వీ సుబ్బారెడ్డి.. నాగిరెడ్డికి సమీప బంధువే. అతని కూతురు శోభ, నాగిరెడ్డి ప్రేమించుకున్నారు. మేనత్త కూతురే అయినా వాళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో నాగిరెడ్డి, శోభ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
భూమా నాగిరెడ్డికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురు అఖిలప్రియను వైఎస్సార్ కుటుంబానికి పంపించారు. అఖిలప్రియకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది, ప్రస్తుతం కమలాపూర్ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కొడుకుతో పెళ్లి జరిగింది. వైఎస్సార్, భూమా కుటుంబాల మధ్య అనుంబంధం కారణంగా ఈ సంబంధం కుదిరింది. అయితే కొన్ని రోజులకే విభేదాలు తారాస్థాయికి చేరుకోవటంతో విడాకులు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో శోభ మరణం తర్వాత అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడే వ్యాపారవేత్త భార్గవరామ్ ను ప్రేమించారు. భార్గవ్ ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావును కూతురును పెళ్లి చేసుకుని.. తర్వాత విడిపోయారు. అఖిలప్రియ, భార్గవ్ రామ్ 2018, ఆగస్టు 29న ఆళ్లగడ్డలో పెళ్లి చేసుకున్నారు.
ఇక మంచు మోహన్‌బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ,హీరోగా రాణించి,నిర్మాతగా సినిమాలు నిర్మించి,రాజకీయ నాయకుడిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి, శ్రీ విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థను నిర్వహిస్తున్న విలక్షణ నటుడు,డైలాగ్ కింగ్,కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు అంటే తెలియని వారుండరు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మార్చి 19న జన్మించిన మోహన్ బాబు కి రంగనాధ్ చౌదరి, రామచంద్ర చౌదరి , కృష్ణ అనే ముగ్గురు తమ్ముళ్ళతో పాటు విజయ అనే సోదరి ఉన్నారు. తండ్రి టీచర్ గా చేసారు. ఇక మోహన్ బాబుకి విష్ణు, మనోజ్ అనే ఇద్దరు కొడుకులు, లక్ష్మి అనే కూతురు ఉన్నారు.కొడుకులిద్దరూ సినిమాల్లో హీరోలుగా వేస్తూ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇక కూతురు కూడా సినిమాల్లో నటిస్తూ కొన్ని టివి కార్యక్రమాల్లో జడ్జిగా, నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఏర్పేడు , తిరుపతిలలో చదివి,చెన్నైలో ఫిజిక్స్ లో డిగ్రీ చేసిన మోహన్ బాబు కొంతకాలం వ్యాయమ ఉపాధ్యాయునిగా పనిచేసారు. సినిమాల్లో దర్శకత్వ విభాగంలో ఐదేళ్లు పనిచేసిన మోహన్ బాబు కి తన గురువు డాక్టర్ దాసరి డైరెక్షన్ లో వచ్చిన స్వర్గం నరకం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ఆవిధంగా చాలా సినిమాల్లో పలు పాత్రలు వేసి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి హీరోగా మారారు. మోహన్‌బాబు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచారు.
భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె సోదరి మౌనికను నంద్యాల నుంచి పోటీ చేయించాలని మొదట అనుకున్నా.. ఆ తరువాత నిర్ణయం మార్చుకొని ఆమె భర్త మంచు మనోజ్‌ను బరిలో దించాలని భూమా, మంచు ఫ్యామిలీస్ డిసైడ్ చేసినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మనోజ్ తన ఫోకస్ భూమా కుటుంబం ఎక్కడెక్కడ పోటీ చేసారో ఆయా నియోజకవర్గాల మీద పెడతాడని తెలిసింది. ఏదీ ఏమైనా మంచు, భూమా కుటుంబాలు కలవడంతో రాజకీయాల్లో మార్పులు జరగవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.